Sunday, July 6, 2008

బాసర

బాసరలో సరస్వతి మూర్తి
బాసరలో సరస్వతి మూర్తి
బొమ్మ:Basara-temple-2.jpg
బాసరలో సరస్వతీ మందిరము
బాసరలో సరస్వతీ మందిరము
బాసరలో సరస్వతీ మందిరము

బాసర, (Basara) ఆదిలాబాదు జిల్లాలోని పుణ్యక్షేత్రం మరియు ముధోల్ మండలానికి చెందిన గ్రామము. బాసర, నిర్మల్ పట్టణానికి 35 కి.మీ దూరంలో గోదావరి నది ఒడ్డున ఉంది. హైదరాబాదుకు సుమారు 200 కి.మీ. దూరం. బాసర సరస్వతి అమ్మవారి క్షేత్రము. భారత దేశంలో గల రేండే రెండు సరస్వతీ దేవాలయాల్లో ఒకటి కాశ్మీరులో ఉండగా, రెండవది ఇదే. బాసరలో జ్ఙాన సరస్వతి అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి సమేతులై కొలువు తీరి ఉన్నారు. ఇక్కడి మందిరం చాళుక్యులకాలంలో నిర్మింపబడింది. ఈ మందిరం సాదా సీదాగా ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నది.

దేవ స్థానం చిరునామా
శ్రీ జ్ఙాన సరస్వతి దేవస్థానము
బాసర గ్రామము, మధోల్ మండలము
అదిలాబాదు జిల్లా
ఆంధ్ర ప్రదేశ్ -- పిన్ కోడు: 504 101, భారత్
ఫోను: +91(0)8752-243503

విషయ సూచిక

[దాచు]

[మార్చు] పురాణగాధ

ఒకప్పుడు వేదవ్యాస మహర్షి దండకారణ్యంలో తపసు చేసుకొంటూ ఇక్కడి ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడయ్యాడు. ఆయనకు జగన్మాత దర్శనమిచ్చి ముగురమ్మలకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించింది. వ్యాసుడు నదిలోంచి మూడు గుప్పెళ్ళు ఇసుక తెచ్చి ముగ్గురు దేవతలమూర్తులు ప్రతిష్టించాడు. అప్పటినుండి ఈ ఊరు 'వ్యాసపురి' యనబడి, తరువాత 'బాసర' గా నామాంతరాన్ని సంతసించుకున్నది.

[మార్చు] దేవాలయం

సుమారు 200 సంవత్సరాల క్రితం విధ్వంస కాండకు పాల్పడుతున్న కొందరు దుండగులను తరిమివేసి మక్కాజీ పటేల్ అనే వ్యక్తి మరి కొందరి సహాయంతో ఆలయం పునర్నిర్మాణం చేయించాడు.

[మార్చు] చూడదగిన స్థలాలు

ప్రధాన దేవాలయానికి తూర్పు భాగమున ఔదుంబర వృక్షఛాయలో దత్త మందిరం, దత్త పాదుకలు ఉన్నాయి. మహాకాళీ దేవాలయం పశ్చిమ భాగమున నిత్యార్చనలతో చూడ ముచ్చటగా ఉంటుంది. శ్రీ వ్యాస మందిరం దక్షిణ దిశలో ఉంది. ఇందులో వ్యాస భగవానుని విగ్రహము, వ్యాస లింగము ఉన్నాయి.

మందిరానికి దగ్గరలో ఒక గుహ ఉన్నది. ఇది నరహరి మాలుకుడు తపస్సుచేసిన స్థలమంటారు. అక్కడ "వేదవతి" (ధనపు గుండు) అనే శిలపై తడితే ఒకోప్రక్క ఒకో శబ్దం వస్తుంది. అందులో సీతమ్మవారి నగలున్నాయంటారు. ఇక్కడికి దగ్గరలో 8 పుష్కరిణులున్నాయి. వాటి పేర్లు - ఇంద్రతీర్ధం, సూర్యతీర్ధం, వ్యాసతీర్ధం, వాల్మీకి తీర్ధం, విష్ణుతీర్ధం, గణేషతీర్ధం, పుత్రతీర్ధం, శివతీర్ధం.

గోదావరి సమీపంలో ఒక శివాలయం ఉంది.

[మార్చు] పూజా విశేషాలు

ప్రతి నిత్యం ఉదయం 5 గంటలకు సరస్వతీ మూర్తికి వైదిక మంత్రోపేతంగా పూజ జరుపుతారు. సాయంకాలం ఆరు గంటలకు పూజ జరుగుతుంది. ఈ ఆలయానికి ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా. మధ్య ప్రదేశ్ వంటి రాష్ట్రాలనుండి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ముఖ్యముగా విద్యా ప్రాప్తికై ఇక్కడ విద్యైఆర్ధులతో అక్షరాభ్యాసము చేయించి దేవికి పలక, బలపము, కాగితము, కలము వంటి కానికలు సమర్పించే ఆచారము ఉన్నది. కేశ ఖండనము, ఉపనయనము, వివాహాలు, భజనలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి.

[మార్చు] ముఖ్యమైన ఉత్సవాలు

మహా శివరాత్రి, వసంత పంచమి, అక్షరాభ్యాసం, దేవీనవరాత్రులు, వ్యాసపూర్ణిమ ఇక్కడ విశేషంగా జరుపబడే ఉత్సవాలు. ప్రధానంగా ప్రతి సంవత్సరం మూడు ఉత్సవాలు జరుగుతాయి

[మార్చు] నవరాత్రులు

ఆశ్వయుజ శుద్ధ పాఢ్యమి మొదలు నవమి వరకు జరుగుతాయి. ఉదయము, సాయంకాలము 64 ఉపచారములతో వైదిక విధానంలో అమ్మవారికి వైభవోపేతంగా పూజలు జరుగుతాయి. శ్రీదేవీ భాగవతము, దుర్గా సప్తశతి పారాయణాలు జరుగుతాయి. మహర్నవమి రోజున చండీ హవము చేయబడుతుంది. విజయదశమి నాడు వైదిక మంత్రాలతో మహాభిషేకము, సుందరమైన అలంకారము, సాయంకాలము పల్లకీ సేవ, శమీపూజ జరుగుతాయి. ఈ ఉత్సవాలలో భక్తులు, ఉపాసకులు తమ తమ అభిష్టానుసారం పూజలు చేసుకొంటారు. ఇంకా ధార్మిక చర్చలు, ఉపన్యాసములు, హరికధలు, పురాణ పఠనం నిర్వహిస్తారు. యాత్రికులకు నిరతాన్నదానం సమర్పిస్తారు.

[మార్చు] శ్రీ పంచమి

మాఘ శుద్ధ పంచమినాడు సరస్వతీ జన్మదినోత్సవం జరుపుకొంటారు. మహాభిషేకం తరువాత వివిధ పుష్పాలతో వాగ్దేవిని నయనానందకరంగా అలంకరిస్తారు. జగద్రక్షణకై, భక్త పోషణకై అవతరరించిన కామితార్ధ ప్రదాయినిగా బాసర జ్ఞాన సరస్వతి ఈనాడు విశేష పూజలందుకొంటుంది.

[మార్చు] మహా శివరాత్రి

మహా శివరాత్రి పర్వదినం మొదలుకొని మూడు రోజులు పెద్ద జాతర సాగుతుంది. వేలాది భక్తులు పవిత్ర గోదావరి నదిలో స్నానం ఆచరించి వాగ్దేవికి ప్రదక్షిణాలు ఆచరిస్తారు.

[మార్చు] మాధుకరము

ఈ వూరిలో ఇది ఒక ముఖ్యమైన సంప్రదాయం. మధుకర వృత్తి (యాచించుట) ద్వారా లభించే భిక్షకు మాధుకరము అని పేరు. శ్రీదేవి అనుగ్రహము కోరేవారు నియమ నిష్టలతో 11 లేదా 21 లేదా 41 రోజులు దీక్షతో గురూపదేశ మంత్రము అనుష్టానం చేస్తారు. ఆ కాళంలో వారు మధ్యాహ్నం వూరిలోనికి పోయి భిక్షను స్వీకరించి, సరస్వతీ దేవికి నమస్కరించి, ఆ భిక్షను భుజిస్తారు.

[మార్చు] వసతులు

ఇదివరకు తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే నిర్మింపబడిన అతిధి గృహం, వేములవాడ దేవస్థానం వారిచే నిర్మింపబడిన అతిధిగృహం మాత్రమే ముఖ్య వసతులు. ప్రస్తుతం అనేక లాడ్జీలు నడుపబడుతున్నాయి.

హైదరాబాదు-మన్మాడ్ మార్గంలో బాసర స్టేషన్ ఉన్నది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి, మరికొన్ని సమీప పట్టణాలనుండి (నిర్మల్, నిజామాబాద్ మరియు భైంసా) బస్సు సౌకర్యం ఉన్నది. నిజామాబాద్ నుండి బాసరకు 35 కి.మీ. దూరం.

[మార్చు] కొన్ని ప్రార్ధనలు

విహిత నమస్కార శరణ్యాం సుఖప్రదామ్
ఓంకార పూరిత నామార్చనాం శుభ ప్రదామ్
పురస్కార సహిత దర్శనాం ఫలప్రదామ్
బాసర క్షేత్రదేవీం భజ సరస్వతీ మాతరమ్
నమోస్తు వేదవ్యాస నిర్మిత ప్రతిష్టితాయై
నమోస్తు మహాలక్ష్మీ మహాకాళీ సమేతాయై
నమోస్తు అష్ట తీర్థజల మహిమాన్వితాయై
నమోస్తు బాసర క్షేత్రే విలసితాయై
యా దేవీ సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థితా
నమస్తస్మై నమస్తస్మై నమస్తస్మై నమోనమః